ప్రసంగ సూత్రాలు

                                                           
                                                    ప్రసంగ సూత్రాలు



ప్రసంగము మనిషిని మార్చేదిగా ఉండాలి. ప్రసంగము చేయుటలో మన ఉద్దేశము ప్రజలలో మార్పును తెచ్చుటయే. మన ప్రసంగాలు ప్రభావవంతంగా ఉండుటకు ఉపయోగపడే కొన్ని విషయాలు చర్చిద్దాం.

1. ప్రార్ధన చేయాలి: ఈ సూత్రమును అన్నిటికంటే ముందు ఉంచుట చాలా ప్రాముఖ్యము. మనిషిలో పశ్చాత్తాపము కలుగజేసి, నూతన క్రియను చేయగలిగింది పరిశుద్ధాత్ముడే కనుక, ఆయనపై అనుకొని ప్రసంగించాలి. సిద్ధపాటుతో మొదలుకొని ప్రసంగము అనంతరము వరకు ప్రార్ధనలో ఆయనతో మనం నడవాలి. అసలు, మనం చేసేది అయన పని కనుక, అయన నడిపింపు లేనిదే పని జరుగదు.

2. ఆసక్తిని కలిగించాలి: మనం చేసిన ప్రసంగం ఒక వ్యక్తి జీవితంలో మార్పును తేవాలంటే, ముందు అతడు దానిని వినాలి. ఒక వ్యక్తి మన ప్రసంగము వినాలంటే, వినాలనే ఆసక్తిని మనం అతనిలో కలిగించాలి. దానికి ఉపకరించే కొన్ని విషయాలు చూద్దాం.

A.పరిచయం: చాలా సార్లు ప్రసంగం మొదలు పెట్టగానే ప్రేక్షకులు నిద్రపోవడమో, సెల్ ఫోనుతో ఆడుకోవడమో, పాటల పుస్తకం తెరిచి చూడటమో మొదలు పెడతారు. అటువంటి వారి ఆసక్తిని రేకెత్తించాలంటే మన ప్రసంగానికి సాధారణ పరిచయం సరిపోదు. ప్రసంగాన్ని ఎంత శ్రద్ధగా సిద్ధపడతామో అంతే శ్రద్ధను పరిచయాన్ని సిద్ధపరచుకునే విషయంలో చూపించాలి. 

మనం చేయబోయే ప్రసంగానికి వారధిగా ఉండే ఏదైనా ఒక ఆసక్తికరమైన మరియు వైవిధ్యమైన అంశాన్ని లేఖన నేపధ్యంలోనుండి, ప్రపంచ సంఘటనలలోనుండి లేదా ఎవరైనా ఒకరి అనుభవములలో నుండి ప్రస్తావించి అక్కడినుండి ముందుకు కొనసాగాలి. 

మన ప్రసంగం వినాలో లేదో మొదటి కొద్ది నిమిషాలలోనే ప్రేక్షకులు నిర్ణయించుకుంటారని కొందరు చెబుతారు.

B.స్పష్టత: ప్రసంగం ఆసక్తికరంగా ఉండి ప్రజల జీవితాలలో మార్పును తేవాలంటే అది స్పష్టంగా ఉండాలి. మనమేమి మాట్లాడుతున్నామో వారికి అర్ధం కాకపోతే, వారు వినాలనే ఆసక్తిని కోల్పోతారు. ఆ తర్వాత మనం ఎంత సేపు చెబితే ఏమి ప్రయోజనం? 

మన ప్రసంగం స్పష్టంగా ఉండాలంటే మాటలు మరియు పదాలు స్పష్టంగా పలకాలి మరియు అవి సాధారణ భాషలో ఉండాలి. ప్రసంగం కాబట్టి పుస్తకాలలో వాడే పదజాలం వాడాలనుకుంటే అది సామాన్య ప్రజలకు అర్ధం కాదు (అలాగని అతి స్వేచ్చను వినియోగించకూడదు). మనం చెప్పే పదాలు అర్ధం కానప్పుడు వారు ఆలోచించడం మానివేస్తారు. అప్పుడు మనం అనుకున్నది సాధించలేము.

C.క్రమపద్ధతి: అలాగే, మన ప్రసంగం కొనసాగించే ప్రక్రియ ఒక క్రమపధ్ధతి కలిగియుండాలి. మనం నడిచేటప్పుడు అడుగులు ఒక పద్ధతిలో వేస్తాము కానీ అటు ప్రక్కకు ఒక అడుగు ఇటు ప్రక్కకు ఒక అడుగు వేస్తే మన వెనుక నడిచేవారు గందరగోళమవుతారు. ప్రసంగము కూడా అంతే. ఒక విషయం తరువాత మరొక విషయం, క్రమపద్ధతిలో మెట్లు ఎక్కుతున్నట్లు ఉండాలి. అప్పుడు వినేవారికి స్పష్టంగా ఉంటుంది. వారు ఆసక్తిగా వింటారు. 

ప్రసంగ నమూనా ముందుగానే వ్రాసి పెట్టుకుంటే క్రమపద్ధతి అవలంబించవచ్చు.

D.ఉపమానాలు: ఒక ప్రసంగం ఆసక్తికరంగానూ, మార్పును తెచ్చేదిగాను ఉండాలంటే ఉపమానాలు వాడాలి. కానీ వాటిని అతిగా వాడకుండా జాగ్రత్త పడాలి. ఉపమానాలు ఆసక్తిని రేకెత్తించి, విషయ స్పష్టతనిచ్చి, జ్ఞాపకశక్తిని పెంచేవిగా ఉపయోగపడతాయి. యేసు తన ప్రసంగములలో ఉపమానము లేకుండా బోధించలేదు.

ఉపమానాలు సమయాన్ని వ్యర్ధం చేసే అంత నిడివి కలిగియుండ కూడదు. లేదంటే, అవి ప్రజలలో ఆసక్తిని పోగొట్టేవిగా మారతాయి. కథ చెప్పడం ఒక కళ. అది అలవర్చుకోవాలి. ముందు దానిని మనం బాగా అర్ధం చేసుకోవాలి. సస్పెన్స్ కొనసాగించి కొసమెరుపు అందించాలి. కొసమెరుపులోనుండి మనం చెప్పాలనుకున్న సత్యాన్ని బయటకు తేవాలి. 

3. ఆచరణాత్మకత: మన ప్రసంగాలు ఆచరణాత్మకంగా ఉండాలి. మనం బోధించిన విషయాలు ప్రజలు తమ జీవితంలో ఏవిధంగా అన్వయించుకోగలరు? అను ప్రశ్న మనం మనసులో ఉంచుకుని మాట్లాడాలి. దైనందన జీవితంలో వారు ఎదుర్కునే సమస్యలు, వాటిని ఆచరణాత్మకంగా ఎలా అధిగమించాలి అనువాటిని మనం తెలియజేయాలి. ఎందుకు, ఎలా? అనే ఈ రెండు ప్రశ్నలకు మనం జవాబివ్వాలి.

4. మాదిరి: మనం బోధించిన దానిని మనం ఎంతవరకు ఆచరిస్తున్నామో మన విశ్వాసులు జాగ్రత్తగా గమనిస్తుంటారు. కావాలని వారు అలా చేయక పోవచ్చు. మన జీవితంలో ఏదైనా ఒక సందర్భంలో ఎలా ప్రవర్తిస్తున్నామో మనలను చూచి వారు నేర్చుకుంటారు. ఫలాని చోటికి ఇలా వెళ్ళాలని ఎవరైనా మనకు చెబితే అది మనకు అర్ధం కానప్పుడు, ఒక్కసారి వచ్చి చూపించకూడదు? అని అడుగుతాం. 

మన బోధ పూర్తిగా వారికి అర్ధం కావచ్చు. కానీ దానిని ఆచరణలో పెట్టాలంటే ఎలాగో వారికి తెలియకపోవచ్చు. అప్పుడు వారు కోరుకునేది మనం ముందు నడిచి వారిని మన వెనుక నిడిపించాలని. గొర్రెల కాపరిని గమనించండి. అతడు ఎల్లప్పుడూ ముందు నడుస్తాడు. అతని గొర్రెలు అతని వెంబడిస్తాయి. మాదిరి చూపించకపోతే మనం నేర్పినది వారు నేర్చుకోలేరు.

కాపరిగా, దేవుడు మనకిచ్చిన బాధ్యత ఆయన ప్రజలను మేపుట. అందుకే పేతురును యేసు తన మందను మేపమని ముమ్మారు అడిగారు. 

యేసును మనం ప్రేమిస్తే అయన మన సంరక్షణలో ఉంచిన తన పిల్లలకు ఉద్దేశపుర్వకంగా, సిద్ధపాటుతో, పుష్టిగల ఆహారమును అందిస్తాము. ఆవిధంగా చేయుటకు పరిశుద్ధాత్ముడు మనకు సహాయపడునుగాక!

Comments

Post a Comment

Popular posts from this blog

పౌలు జీవిత చరిత్ర

ఉదయకాల ప్రార్ధన