ప్రతి ఒక్కరు తప్పకుండా చదవండి

                              మాటలతోనా, క్రియలతోనా?       

మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున అందరికి వందనములు. ఈ రోజులలో కొంతమంది క్రీస్తు ప్రేమను ప్రకటిస్తున్నామని, క్రీస్తును ప్రేమిస్తున్నామని చెప్తూ అద్బుతముగా డిజైన్లతో దేవుని లేఖనములను Wallpapers (ఫోటోలు) గా డిజైన్ చేసి Whatspp, Facebook లో పెడుతున్నారు. 

మరి కొంతమంది స్టేటస్ లో “Jesus I love You” అని “Jesus is My Life” అని “Bible is My Teacher” అని ఇలా రక రకాలుగా స్టేటస్ లు పెడుతుంటారు. ఏదైతేనేమి యేసు క్రీస్తు మీద, బైబిలు మీద తమకు ఉన్న ఫీలింగ్స్ ను  వ్రాత పూర్వకముగా, మాటల ద్వారా, ప్రసంగాల ద్వారా అద్భుతముగా ప్రపంచానికి తెలియజేస్తున్నారు, సంతోషం అలా చెయ్యడం మంచిదే, తప్పేమీ కాదు. 

కాని వారిలో చాలా మందికి “క్రీస్తు మీద ఉన్న ప్రేమ మాటల వరకు పరిమితమైనది కాని క్రియల్లో మాత్రం కనపడుటలేదు.” బహుశా యేసు క్రీస్తు మీ జీవితాలలో చేసిన అద్భుత కార్యాలను బట్టి, రక్షణ (సిలువ త్యాగం) కార్యాన్ని బట్టి అయన మీద ఎంతో ప్రేమ ఉండొచ్చు, కాని ఆ ప్రేమను క్రియల్లో చూపలేకపోతే వ్యర్థం. 

క్రియలు లేని విశ్వాసం మృతం అని, తను చూసిన సహోదరుని ప్రేమించలేని వాడు తను చూడని దేవుని ప్రేమించలేడు అని వాక్యం సెలవిస్తుంది (యాకోబు 2:26; 1 యోహాను 4:20).

కాని ఈ రోజులలో తోటి సహోదరులను ప్రేమించకుండా వారి మీద అసూయ, కక్షలు పెంచుకొని యేసు క్రీస్తుని ప్రేమిస్తున్నామని చెప్పడం చాలా బాధాకరమైన విషయం. 

ఒక సంఘము వారికి మరో సంఘము అంటే నచ్చదు. ఆ సంఘ సిద్దాంతాలు వేరు, మా సంఘ సిద్దాంతాలు వేరు, మా సిద్ధాంతాలే వాక్యానుసారమైనవి అని ఒకరితో ఒకరు గొడవలు పడుతూ, బూతులు తిట్టుకుంటూ, ద్వేషాన్ని పెంచుకొంటున్నారు. అట్టి వారు అబద్దికులు అని వాక్యం సెలవిస్తుంది (1 యోహాను 4:20)
ఏది వాక్యనుసారమో కాదో పరిక్షించడం, తెలుసుకోవడం తప్పు కాదు కాని ఆ పరీక్షించే విధానంలో సహోదరుల మధ్య ప్రేమ కనపడుటలేదు. “సిద్ధాంతాలు ఎన్ని రకాలుగా ఉన్నా, సంఘాలు ఎన్ని ఉన్నా, మనమందరం కూడా క్రీస్తు రక్తములో కడగబడినవారము అని, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము యేసు క్రీస్తు నందు ఏకముగా, ఒకే శరీరముగా సహోదరులుగా ఉన్నామన్న విషయాన్ని గుర్తించి ప్రేమ కలిగి నడుచుకోవాలి” (1 కోరింధి 12:12-27, గలతీ 3:26-28, ఎఫేసి 5:2-4)

మరి కొందరు మేము దేవుని గురించి మాట్లాడుతున్నామని, సత్యాన్ని ప్రకటిస్తున్నామని, హేతువు (క్రైస్తవేతరుడు) అడుగు వారికి సమాధానం చెప్తున్నాము అంటున్నారు కాని ఆ చెప్పే విధానంలోనే బూతులు, దూషణ పదజాలంతో ఒకరిని ఒకరు తిట్టుకుంటూ దేవునికి వ్యతిరేకముగా ప్రవర్తించడం బాధాకరం (1 పేతురు 3:15-15; ఎఫేసి 5:4 చదవండి)  

దీని వల్ల అన్యులకు, క్రైస్తవులకు తేడా లేకుండా పోయింది. దేవుడు మనలను సాత్వికముతో, భయముతో సమాధానం చెప్పమన్నాడు తప్ప, బూతులతో ద్వేషంతో కాదు. వాళ్ళు తిట్టారని మనము కూడా తిట్టడం, దూషించడం మంచిది కాదు. 

“మీరు దేనివిషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్‌ప్రవర్తన మీద అపనిందవేయువారు సిగ్గుపడుదురు.” -- 1పేతురు 3:16

ఇంకొందరు మాటలు కోటలు దాటిస్తారు కాని క్రియలు మాత్రం శూన్యం. అట్టి వారి గురించి వాక్యం ఏమని సెలవిస్తుంది చూడండి. 

1యోహాను 3:17 -- ఈ లోకపు జీవనోపాధిగలవాడైయుండి, తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, అతనియెడల ఎంతమాత్రమును కనికరము చూపనివానియందు దేవుని ప్రేమ యేలాగు నిలుచును?

యాకోబు 2:15-16  -- సహోదరు డైనను సహోదరియైనను దిగంబరులై ఆ నాటికి భోజనములేక యున్నప్పుడు. మీలో ఎవడైనను శరీరమునకు కావలసినవాటిని ఇయ్యక-సమాధానముగా వెళ్లుడి, చలి కాచుకొనుడి, తృప్తిపొందుడని చెప్పినయెడల ఏమి ప్రయోజనము? ఆలాగే విశ్వాసము క్రియలులేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును.

అట్టి విశ్వాసం మృతమైనది అని వాక్యం తెలియజేస్తుంది. “ఒక్కసారి మిమ్మును మీరు పరీక్షించుకోండి” మీ ప్రేమ మాటలవరకు ఉందా? లేక క్రియల్లో కూడా ఉందా అని ఆలోచించండి. 
“నేడు పరిస్తితి ఎలా ఉందంటే సహోదరులు ఆపదలో, ఇబ్బందిలో ఉంటే ఇంకా ఎగతాళి చేస్తారు కాని ఆదుకుందాము అని మాత్రం అనుకోరు.”

మరి కొంతమంది ప్రార్థిస్తాము అంటారు మంచిదే, ప్రియమైన సహోదరి, సహోదరుడా ఎవరైనా ఇబ్బందులలో, లేమిలో ఉన్నప్పుడు మనవంతు సహాయం చెయ్యడానికి ప్రయత్నించాలి, ఒకవేళ సహాయంచేసే స్థితిలో లేకపోతే ప్రార్థిస్తాము అని చెప్పాలి వారిని దేవుని మాటలతో ఆదరించాలి. అంతే కాని సహాయం చేసే స్థితిలో ఉండి కూడా ప్రార్థిస్తాము అని చెప్పడం సరికాదు. 
(నోట్: అలా అని ఫేస్బుక్ లో దానధర్మాలు చెయ్యడం మొదలు పెట్టకండి, మోసాలు జరుగుతున్నాయి కనుక జాగ్రతగా వుండండి, తెలివితో సందర్భానుసారముగా నడుచుకోండి. )

కనుక మనమందరము కూడా మాటల ద్వారా ప్రేమించడం, ప్రకటించడం మాత్రమే కాకుండా క్రియల ద్వారా కూడా ప్రేమిద్దాము. అట్టి కృప దేవుడు మన అందరికి దయచేయును గాక. ఆమెన్. 

1యోహాను 3:18 --  చిన్న పిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతము.

Comments

Popular posts from this blog

పౌలు జీవిత చరిత్ర

ఉదయకాల ప్రార్ధన

ప్రసంగ సూత్రాలు